ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి సర్వేశు పూజించి యబ్బానుజున్ బంటుగావించి యవ్వాలినిన్ జంపి కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థివై లంకకేతెంచియున్ లంకిణింజంపియున్ లంకనున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగ యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషనున్ జేసి సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి వానరా మూక పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ
నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాదితో పోరాడి చెండాడి శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్ నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్ ఇచ్చి అయోద్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్
శ్రీరామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే యో వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార యోధీర యోశూర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచు స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి
శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వయందుండియున్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకారహ్రీంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి రారా నాముద్దు నృసింహాయటంచున్ దయాదృష్ఠివీక్షించి నన్నేలు నాస్వామీ
ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే వాయుపుత్రా నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమో నమః

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

73.0K

Comments

mh5qx

Other languages: EnglishKannada

Other stotras

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |