జో అచ్యుతానంద

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద రామ గోవిందా జోజో జోజో
నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునులుకు అభయమిచ్చినావు
మేలుగా వసుదేవుకుదయించినావు
బాలుడై ఉండి గోపాలుడైనావూ జోజో జోజో
అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టే తినెనని యత్త యడుగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
గొల్లవారిండ్లకు గొబ్బునకు బోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీకొడుకు మాయిండ్లలోను
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెరిచె నేమందుమమ్మ
ఒకనియాలిని దెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతుల బట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
గోవర్థనంబెల్ల గొడుగుగాగ పట్టి
కావరమ్మున నున్న కంసు పడకొట్టి
నీవుమధురాపురము నేల చేబట్టి
ఠీవితో నేలిన దేవకీ పట్టి
అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో

 

 

Copyright © 2023 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |