శ్రీమద్దేవీ భాగవత మాహాత్మ్యం
ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడావిలాసం, జగత్సృష్టివేళ సృజనస్వరూప, రక్షణవేళ పాలనస్వరూప, సంహారవేళ రౌద్రస్వరూప. పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వా శక్తిని అనుగ్రహించుగాక ! ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి, నరనారాయణులకు శిరసువంచి, సరస్వతీదేవినీ వ్యాసమహర్షినీ అభినుతించి పురాణం ప్రారంభించాలి.
నైమిశారణ్యంలో సమావిష్ణులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూతమహర్షి! నువ్వు వందల సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి. మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణుకథలు చెప్పావు. అవతారగాథలు వర్ణించావు. శివుడి చరిత్రలు వినిపించావు. భస్మరుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తిశ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని
జ్ఞాన - ఆనందాలను పొందాము. ఇంక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనమూ అనాయాసంగా భుక్తిముక్తిప్రదమూ అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు.
శౌనకాది మహామునీశ్వరులారా ! అడగవలసింది అడిగారు. లోకహితం కోరి అడిగారు. కనక సర్వశాస్త్ర సారమూ పరమపావనమూ దేవీ భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలూ తీర్థాలూ వ్రతాలూ మిడిసిపడేది. ఈ దేవీ భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి. గాఢ కిల్బిషతమస్సులకు పొద్దు పొడుపు. వినిపిస్తాను.
సూతమహర్షీ ! తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం. విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ? ఎన్ని రోజుల్లో వినాలి ? ఏ పూజలు చెయ్యాలి? లోగడ ఎవరెవరు విన్నారు ? ఏమేమి ఫలాలు పొందారు ? ఎవరు వినిపించారు ?
మునీశ్వరులారా ! విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా ! వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేనివారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యులద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు. చదివించాడు. వాటిలో దేవీ భాగవతం - ఉత్తమోత్తమ పురాణం. భుక్తిముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Copyright © 2024 | Vedadhara | All Rights Reserved. | Designed & Developed by Claps and Whistles
| | | | |